సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేద ఆడపిల్లల వివాహాలకు రూ.1,00,016 అందిస్తున్నారని కొనియాడారు. పండగ వాతావరణంలో గృహప్రవేశాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఇళ్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోరు.. ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వద్దు. కేవలం అధికారులు మాత్రమే పారదర్శకంగా ఇండ్లు పంపిణీ చేస్తారని తెలిపారు. అంబేద్కర్ నగర్ లో అంగన్వాడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గోడకి ఖబర్ కాలనీలో బస్తీ దవాఖానను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ బొంతు రామ్మోహన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, హెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.