సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు అంతా హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ చుట్టూ తిరుగుతోంది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనను పదవినుంచి తొలగించింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించింది. అయితే, రమేష్‌కుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లో తిరిగి నియమించాలని కూడా ఆదేశించింది. కానీ, ఏపీ సర్కారు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో న్యాయపోరాటం చేస్తున్న రమేష్‌కుమార్ ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్‌హయత్ హోటల్‌లో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కామినేని శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. పార్క్ హయత్ హోటల్‌లో వీరు భేటీ అయ్యారని, కుట్రలకు ఇదే నిదర్శనమని, వీరంతా భేటీ కావడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని అధికార వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి కొన్ని సీసీ టీవీ పుటేజీలను కూడా బయటపెట్టారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ హోటల్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో పాటు సుజనాచౌదరిని వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిశారట. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీలు కూడా ఆ పార్టీ అధిష్టానానికి చేరాయట. దీంతో ఆ పార్టీలో ఇప్పుడు అది హాట్ టాపిక్‌గా మారడంతో పాటు ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారట. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌లు దొరికినప్పుడే వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలవి కూడా లభించాయని, కాకుంటే వాటిని ఎడిట్ చేసి మీడియాకు పంపారని జోరుగా చర్చ సాగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రతిసారీ తలకిందులవుతున్న వైఎస్సార్సీపీ అంచనాలు ఇప్పుడు ఏకంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారైందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ భేటీకి ఎందుకు వెళ్లారు. తమ కష్టాలు, ఇబ్బందులను చెప్పుకునేందుకు వెళ్లారా.. లేక, వీరంతా బీజేపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారా? అన్న అనుమానంతో వైఎస్సార్సీపీ లీడర్లకు నిద్రపట్టడం లేదట. అయితే, ఇందులో ఎంత వాస్తమముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదుమరి.