Breaking News

ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: గతనెలలో అర్ధాంతరంగా వాయిదాపడిన శాసనసభా సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ సమావేశాలను ఫక్తు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు, అందుకోసం చట్టాల్లో సవరణల కోసమే నిర్వహించనున్నారు. కరోనా కారణంగా సెప్టెంబర్​ 28వ తేదీ వరకూ కొనసాగాల్సిన సమావేశాలు, ఆనెల 16కే వాయిదా పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధుల్లో అనేక మందికి కరోనా సోకిన కారణంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి సభను సమావేశపరుస్తామని ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. నవంబర్​లో నిర్వహించతలపెట్టిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే అసెంబ్లీని నిర్వహించబోతున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తప్పుల తడకగా ఓటరు లిస్టు
2011 జనాభా లెక్కల ప్రకారమే 2016లో గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ జనగణన జరగలేదు. ఆ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా, సంబంధిత వివరాలపై స్పష్టత ఇవ్వాలంటూ విపక్షాలు కోరుతున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ, జీహెచ్‌ఎంసీగాని నోరు మెదపడం లేదు. మరోవైపు బీసీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. వారి జనాభా ఆధారంగా డివిజన్లలో రిజర్వేషన్లు తాజాగా ఖరారు చేయాల్సి ఉంది. కానీ తప్పులతో కూడిన జాబితా ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నేను ఓసీని. కానీ ఓటర్ల జాబితాలో నా పేరు బీసీగా నమోదైంది…’ అంటూ అధికార టీఆర్​ఎస్​ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనాభా లెక్కలు, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లలో మార్పులు, చేర్పుల అంశంపై విపక్షాలు పదే పదే అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం అసెంబ్లీని సమావేశ పరచబోతుందని తెలుస్తోంది. తద్వారా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా చట్టసవరణ చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ స్టాడింగ్‌ కమిటీల రద్దు?
మరోవైపు ఓటర్ల సంఖ్య… ఒక్కో డివిజన్‌లో ఒక్కో తీరుగా ఉంది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మెహిదీపట్నం డివిజన్‌లో 29,854 మంది ఓటర్లు ఉండగా, కుత్బుల్లాపూర్‌ పరిధిలోని సుభాష్​నగర్‌ డివిజన్‌లో 89,150 మంది ఓటర్లు ఉన్నారు. వారి సంఖ్యకు సంబంధించి ఇంత వ్యత్యాసమెలా? ఉంటుందంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు సంబంధించి ప్రభుత్వానికి ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తే ఎలా అంటూ వారు నిలదీస్తున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీల జనాభా, వారి ఓట్ల సంఖ్య, తదనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు… ఇలా వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రజలకు అందుబాటు(పబ్లిక్‌ డొమైన్‌)లో ఉంచాలని విపక్షాలు కోరుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీంతోపాటు ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన సర్కారుకు కొంత ఇబ్బందిగా మారింది. దీన్ని తొలగించాలని మిత్రపక్షమైన ఎంఐఎం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ఆ నిబంధనను ఎత్తేసిన ప్రభుత్వం… జీహెచ్‌ఎంసీకి కూడా అదే సూత్రాన్ని వర్తింపజేయనుందని సమాచారం. పనిలో పనిగా జీహెచ్‌ఎంసీ స్టాడింగ్‌ కమిటీలను కూడా రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అంశాలన్నింటిపై ఎవరూ నోరు మెదపకుండా ఉండేందుకే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశపరుస్తున్నదని తెలిసింది. తద్వారా ఆయా అంశాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది