సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి సుమారు రెండుగంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. చెరువులు, కుంటలు ఏమయ్యాయి. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. భారీవర్షానికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇమామ్ గూడ సమీపంలో హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, ఫిర్జాదిగూడ పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. హైదరాబాద్- వరంగల్ హైవేపై వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చింతలకుంట వద్ద ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి, ఊర్కొండ, వంగూరు, చారకొండ మండలాల్లో భారీవర్షం పడింది.