సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు నెరవేర్చుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పాలకుడి సంకల్పం గట్టిగా ఉంటే ఆ దేవుడు కూడా కరుణిస్తాడని, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు నిరూపించాయని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకుని రైతుల కళ్లల్లో సంతోషం చిగురించేలా చేశాయన్నారు.
నల్లగొండకు గోదావరి, కృష్ణాజలాలను తరలించి సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. ఫ్లోరైడ్ రక్కసిని తరిమేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కండ్లు అసూయతో ఎర్రబడుతున్నాయని విమర్శించారు. అసూయ, విద్వేషాలతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. కరోనాపై కాంగ్రెస్, బీజేపీల రాజకీయాలను ప్రజలు ఛీకొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఆస్పత్రుల యాత్ర రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. శ్రీశైలం పవర్‌హౌస్‌లో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోందని ప్రభుత్వ విప్గొంగడి సునీత వివరించారు.