- పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు
- పవర్‌హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి
- గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, ప్రజాస్వామిక హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. విలువలకు పాలకులు సమాధికట్టేశారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాక ఓ బందిపోటు ముఠా నాయకుడిగా, ఆధునిక నియంతగా అరాచక పోకడలు పోతున్నాడు. ప్రాథమిక హక్కులు, పౌరహక్కులు, వాక్ స్వాతంత్ర్యం, రాజకీయ స్వేచ్ఛ అన్నవి మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధించడమే పోలీసుశాఖ పనిగా మారిపోయింది.
ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, వారి ఇళ్ల దగ్గర నిరంతర నిఘా, కదలికలపై నిఘా పెట్టడం, ఫోను సంభాషణలపై నిఘా పెట్టడం ప్రభుత్వ అప్రకటిత ప్రాధాన్యమైంది. ప్రజాప్రతినిధులమైన మేం స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి లేదు. చంద్రశేఖర్ రావు సీఎం అయ్యాక సామాన్యులకు దర్శనభాగ్యం దేవుడెరుగు.. ప్రతిపక్ష నేతలకు సైతం అపాయింట్ మెంట్లు లేవు. ఆయన సచివాలయానికి రారు. ధర్నానో, నిరసననో చేపట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామంటే ధర్నాచౌక్ మూసేశారు. ఇక సామాన్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన 9 మంది సిబ్బంది మృత్యువాతపడిన విషయం మీకు తెలిసిందే. మనుషుల ప్రాణాలతో పాటు వేలకోట్ల రూపాయల విలువైన జాతి సంపద పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సంకేతాలను హెచ్చరిస్తూ రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అక్కడ సిబ్బంది సమాచారం పంపారు. సదరు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమే. బాధిత కుటుంబాలను పరామర్శించి, వాస్తవ పరిస్థితిని తెలుసు కునేందుకు నేను, కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ఈ రోజు ఉదయం శ్రీశైలం బయలుదేరాం. మార్గమధ్యంలో డిండి వద్ద పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. పరామర్శకు అనుమతించాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదని పేర్కొన్నారు. అత్యంత పాశవికంగా, మా వాహనాల నుంచి ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు.
విద్యుత్ కేంద్రం ప్రమాదంలో మానవతప్పిదం ఉంది. కింది స్థాయి సిబ్బంది హెచ్చరించినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. దీనికి పూర్తిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలి. వారిద్దరిపై చర్యలు తీసుకునేలా మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాలని సవినయంగా కోరుతున్నా.. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. కోవిడ్ పై స్పందిన తీరుగానే ఈ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నా..’ అని ఎంపీ రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.