- టీఆర్ఎస్ నాయకుడి దారుణహత్య
- ఘటనను ఖండించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
సారథి న్యూస్, వెంకటాపురం(ములుగు): మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.. శనివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి భీమేశ్వర్ రావు(50)ను దారుణంగా హతమార్చారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. సంఘటన స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటురు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు వెంటనే వారి వారి పదవులకు రాజీనామాలు చేయాలి. లేకపోతే వారికి కూడా ఇదే గతి పడుతుంది’ అని ఆ లేఖలో హెచ్చరించారు.
సామాన్య ప్రజలపై మావోయిస్టుల హత్యాకాండ
ఈ ఘటనను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఖండించారు. వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావు అనే వ్యక్తిని మావోయిస్టులు పలుమార్లు పార్టీ ఫండ్ అడగ్గా తిరస్కరించారని, అందుకు కక్షసాధింపు చర్యగా సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు నిన్న అర్ధరాత్రి అతని ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి భీమేశ్వరరావుపై దాడి చేసి కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నా వినకుండా అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్యచేశారని వివరించారు. జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ, రోడ్లను తవ్వి సామాన్య ప్రజానీకానికి ఆటంకాలకు గురిచేస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల పార్టీ ఫండ్ ఇవ్వని సామాన్య ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హత్యాకాండ చేస్తున్నారని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ విలేకరులకు తెలిపారు.