- శరీరంపై గడ్డలతో ఎద్దులు, ఆవులు విలవిల
- ముదిరితే అవి చిట్లిపోయి.. తీవ్ర అవస్థలు
- మానవపాడు మండలంలో నాలుగు ఎద్దులు మృతి
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరి టెన్షన్లో వాళ్లున్నారు. సరిగ్గా ఈ టైంలోనే పశువులను వింత రోగం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీరంపై అనుకోకుండా వచ్చిన కురుపులు, గడ్డలుగా మారి.. మూగజీవాలకు నిద్రలేకుండా చేస్తోంది. అవి చిట్లిపోయి శరీరమంతా కుళ్లిపోయేలా చేస్తోంది. కాడెద్దులు, ఆవులు కళ్లముందే చనిపోతుండడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. కరోనా మహమ్మారి పశువులకు పశుపక్షాదులకు ఇంకా ఏ ఇతర జంతువులకు ప్రబలినట్లు ఎక్కడా నిర్ధారణ అయితే కాలేదు. కానీ ఇటీవల పశువులకు వింత వ్యాధి అంటుకుంది. పశువుల చర్మంపై చిన్న చిన్న గడ్డలు ఏర్పడి అవి చిట్లిపోయి శరీరమంతా పాకుతోంది.
పశువులు మృత్యువాత
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో సుమారు రెండు వందల పశువులకుపైగా ఈ వ్యాధి ప్రబలింది. బొంకూరు, అమరవాయి గ్రామాల్లో ఇప్పటివరకు నాలుగు ఎద్దులు, ఓ గేదె చనిపోయింది. పశువులకు ఏ వ్యాధి అంటుకుందో అర్థంకాక రైతులు దిక్కుతోచనిస్థితిలో తమకు తెలిసిన నాటువైద్యం చేసుకుంటున్నారు. మరికొందరు పశువుల ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ముందే వెటర్నరీ డాక్టర్లతో సూదులు ఇప్పిస్తున్నారు. ఉన్నతాధికారులను చొరవ తీసుకుని తమ పశువులను కాపాడాలని కోరుతున్నారు.
చిన్న చిన్న గడ్డలు పుడుతున్నయి
పశువుల శరీరంపై చిన్న చిన్న గడ్డలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ మనుషులకు ఇచ్చిన సూదులే ఇస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఆ మందులను కూడా బయట మెడికల్ షాపులో మా చేతను తెప్పిస్తున్నారు. నా ఎద్దులు ఏమైపోతాయోనని బాధగా ఉంది.
:: టి.శివ, రైతు, అమరవాయి
సరైన వైద్యం అందుతలేదు
ఎద్దులకు ఏ రోగం వచ్చిందో తెలియక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంతవరకు సరైన వైద్యం, సూది మందులు అందడం లేదు. పదిరోజుల నుంచి ఎడ్ల ఆరోగ్యం దెబ్బతిన్నది. అవి చనిపోతాయేమోనని భయంగా ఉంది. పశువులకు సూదులు, మందులు ఇవ్వాలి.
:: రాముడు, రైతు, మానవపాడు
వ్యాధి నిర్ధారణ కాలేదు
గతంలో ఇలాంటి వ్యాధి పశువులకు రాలేదు. మూడు రోజుల్లో మండలంలో సుమారు రెండొందల పశువులకుపైగా ఈ వ్యాధి సోకింది. మా వద్ద ఉన్నమందులు ఇచ్చి వైద్యం చేస్తున్నాం. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. కొంతమంది రైతులు కరోనా వైరస్ ప్రబలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదు.
:: డాక్టర్ రాజేష్, పశువైద్యాధికారి, మానవపాడు