Breaking News

తల్లడిల్లిన సిటీ

తల్లడిల్లిన సిటీ

  • జలదిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం
  • నిండుకుండలా హుసేన్​సాగర్​, హిమాయత్​సాగర్​
  • భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో కరెంట్​ కట్​
  • ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
  • హైదరాబాద్​– విజయవాడ హైవేపై రాకపోకలు బంద్​
హయత్​నగర్​లో వరద నీటిలో కొట్టుకుపోయిన కారు

:: ఆర్​కే,

సారథి న్యూస్​, హైదరాబాద్​ ప్రత్యేక ప్రతినిధి

భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతోంది.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది.. అడుగు బయటికేస్తే ఎక్కడి డ్రెయినేజీలో కొట్టుకుపోతావేమోనన్నభయం వెంటాడుతోంది.. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయి అంధకారం అలుముకుంది. ఏ ఇల్లు చూసినా చెరువును తలపిస్తోంది.. వరద నీటితో మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ శాఖ రెడ్​అలర్ట్ ​ప్రకటించింది. హుస్సేన్​సాగర్​ నిండుకుండలా మారింది. ఏ క్షణంలోనైనా గేట్లను ఎత్తివేసే అవకాశం ఉండడంతో దిగువన ఉన్న అశోక్​నగర్ ​వాసులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్​– విజయవాడ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ హైవేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటి నుంచి ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. హిమాయత్ సాగర్​ నీటి మట్టం కూడా క్రమేపీ పెరుగుతోంది.

హైదరాబాద్‌లో గోడ కూలి 9 మంది దుర్మరణం
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చాంద్రాయణగుట్ట మహ్మదీయ హిల్స్‌లో మంగళవారం అర్ధరాత్రి కాంపౌడ్‌ వాల్‌ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మహ్మదీయహిల్స్‌లో ఓ కాంపౌడ్‌ వాల్‌ కూలి ఐదుఇండ్లపై పడింది. దీంతో ఒక ఇంట్లో ఉన్న ఐదుగురు, మరో ఇంట్లో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

స్తంభించిన ట్రాఫిక్‌
ఎగువ ఉన్న కాలనీల నుంచి వరద ఉధృతి పెరగడంతో సరూర్​నగర్​ చెరువు కట్ట తెగి దిల్​సుఖ్​నగర్​, సాయిబాబ గుడి ప్రాంతం, చైతన్యపురి, సరూర్​నగర్​ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చైత‌న్యపురి నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు చిన్న వాహ‌నాల‌కు పోలీసులు అనుమ‌తించ‌డంలేదు. ర‌హ‌దారుల‌పై నీటి నిల్వతో చిన్న వాహ‌నాల‌ను దారిమ‌ళ్లిస్తున్నారు. దిల్​సుఖ్‌న‌గ‌ర్ ప‌రిస‌రాల్లోని లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మయ్యాయి. మూడు బ‌స్సులు, కార్లు నీటిలో చిక్కుపోయాయి. దీంతో దిల్​సుఖ్‌న‌గ‌ర్ నుంచి కోఠి వెళ్లే మార్గంలో రాక‌పోక‌లు స్తంభించాయి. చైత‌న్యపురం, పీఎన్‌టీ కాల‌నీ, కొత్తపేట్ డివిజన్ మోహన్ న‌గర్‌లోని కాల‌నీలు నీటిలో మునిగిపోయాయి. చంపాపేట‌, రాజిరెడ్డిన‌గ‌ర్‌, రెడ్డి కాల‌నీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. న‌గ‌రంలోని సుమారు 1500 కాల‌నీలు నీట‌మునిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ కాల్వ

రికార్డు స్థాయిలో వర్షపాతం
జీహెచ్ఎంసీ ప‌రిధిలోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఘ‌ట్‌కేస‌ర్ సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో 32.2 సెం.మీ. వ‌ర్షపాతం, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో 29.4, హ‌స్తినాపురంలో 28.3 సెం.మీ, అబ్దుల్లాపూర్‌లో 26.5, ఇబ్రహీంపట్నంలో 25.6 సెం.మీ., స‌రూర్‌న‌గ‌ర్‌లో 27.1, ఉప్పల్​లో 25.3 సెం.మీ, ముషీరాబాద్‌లో 25.2 సెం.మీ, బండ్లగూడ‌లో 23.3 సెం.మీ., మేడిప‌ల్లిలో 23.2 సెం.మీ. సికింద్రాబాద్‌లో 22.3 సెం.మీ., మ‌ల్కాజిగిరిలో 22.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో మ‌రో మూడు రోజుల‌పాటు ప్రజలు బయటికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మూసారాం బాగ్ రూట్​లో పరవళ్లు తొక్కుతున్న మూసీ కాల్వ

ఉప్పొంగుతున్న మూసీ
ఎగువ ఉన్న హిమాయాత్ సాగ‌ర్ గేట్లు తెర‌వ‌డంతో వరద ఉధృతికి మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంబ‌ర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే మార్గంలో ఉన్న మూసారాంబాగ్ బిడ్జ్ వ‌ద్ద వ‌ర‌ద నీరు పొంగిపారుతోంది. దీంతో ఆ రూటును పోలీసులు మూసివేశారు. ట్రాఫిక్ పోలీసు అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఐపీఎల్ అనిల్ కుమార్ దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. మూసారాం బాగ్ రూట్​లో వెళ్లే ప్రయాణికులు మ‌రో మార్గంలో వెళ్లాల‌ని సూచించారు. నాంప‌ల్లి వ‌ద్ద భారీ వృక్షం నేల‌కూలింది. బ‌షీర్‌బాగ్‌లోని ఆయాకార్ భ‌వ‌న్ వ‌ద్ద కూడా ఓ భారీ వృక్షం ప‌డిపోయింది. ఆ రూట్లో వెళ్లే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల‌ని అధికారులు ఆదేశించారు. ఫ‌ల‌క్‌నుమా ఆర్‌యూబీ వ‌ద్ద భారీ వ‌ర‌ద నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహ ఉధృతి తగ్గేవరకు ప్రయాణికులు మరో మార్గంలో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల వాహ‌నాలు బ్రేక్‌డౌన్ కావ‌డంతో.. వాటిని ప్రత్యేక వాహ‌నాల్లో ట్రాఫిక్ పోలీసులు త‌ర‌లిస్తున్నారు. భారీవర్షాలకు నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్‌లోని స‌ఫారీ పార్క్ స‌హా మ‌రికొన్ని స్థలాల్లో వ‌ర‌ద‌నీరు చేరింది. దీంతో జూపార్కును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాన‌ల తాకిడికి మాదాపూర్‌లోని శిల్పారామంలో భారీ వృక్షాలు నేల‌కూలాయి. దీంతో శిల్పారామాన్ని మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అదేవిధంగా ఉప్పల్​ శిల్పారామంలో భారీగా వరదనీరు చేరింది.

హైద‌రాబాద్‌లో హైఅల‌ర్ట్‌.. రోడ్లు మూసివేత


-ఉప్పల్​- ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ – కోఠి రోడ్లు మూసివేత‌
-బేగంపేట‌లో ర‌హ‌దారిపై భారీగా వ‌ర‌ద నీరు
-కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై నిలిచిన వ‌ర్షపు నీరు
-నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ జ‌ల‌మ‌యం

–మెహిదీప‌ట్నం – హైటెక్ సిటీ ర‌హ‌దారి జ‌లమ‌యం
-కూక‌ట్‌ప‌ల్లి ఐడీపీఎల్‌, హాఫిజ్‌పేట చెరువులకు భారీ వ‌ర‌ద‌
-హుస్సేన్ సాగ‌ర్ 4 గేట్లు ఓపెన్‌
-గ‌చ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీగా వ‌రద నీరు
-బెంగ‌ళూరు – హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ హైవేలు మూసివేత