- దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం
- కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం
- యాజమాన్య హక్కు సమస్యలను పరిష్కరించాలి
- నియంత్రిత సాగు.. రైతుల్లో గొప్ప పరివర్తన
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఇది భవిష్యత్‌లో సాధించే గొప్ప విజయానికి నాంది అని అన్నారు. సీడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతిపెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రైతులకు అండగా నిలవాలనే..
‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలి. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ అందించేలా ఏర్పాట్లు చేయాలి.
ఖాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయమందించాలి. ఈ విషయంలో రైతుబంధు సమితులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒకసారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్లా మంచిది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ‘మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’ అని కోరారు.
ఇది రైతుల గొప్ప పరివర్తన
‘ రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించింది. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్‌లో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది. ఇది శుభసూచకం. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తుంది’ అని అన్నారు.
రైతు వేదికలు పూర్తికావాలి
‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి’ అని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, రామకృష్ణారావు, నర్సింగ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు విజయ్ కుమార్, డీడీఏ శైలజ, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పాల్గొన్నారు.