Breaking News

కరోనా పోలే.. జాగ్రత్తగా ఉండాలె

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్​–19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం స్థానిక కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. వృద్ధులు, చిన్నారులను బయటికి రాకుండా చూడాలని ఆదేశించారు. మాస్క్​లు కట్టుకుంటేనే, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డిప్యూటీ మేయర్, డీఎంహెచ్​వో డాక్టర్​ పి.సుధాకర్​ పాల్గొన్నారు.