హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ప్రయోగశాలలకు ఐసీఎంఆర్ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య పెరగకుండా చూడాలన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని సంజయ్ కొనియాడారు. కుటుంబాలను పక్కనపెట్టి, వృత్తిని నమ్ముకుని పనిచేయడం సంతోషకరమన్నారు. అంతకుముందు రెండు వందల మంది మీడియా ప్రతినిధులకు కళ్లజోడు, విటమిన్-సీ, విటమిన్-డీ మాత్రలు, టూత్ పేస్టులు, గొడుగులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.