Breaking News

ఇక ఫుల్లు వానలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. 10 రోజుల తర్వాత గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. వాస్తవానికి తెలంగాణలో జూన్‌ 8నే ప్రవేశించాలి. కానీ మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే మాత్రం పది రోజులు ముందే ప్రవేశించాయి. 2019లో జూన్‌ 21న, 2018లో జూన్‌ 8న ఇవి తెలంగాణలో ప్రవేశించాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా ఎక్కువ కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మెదక్​లో కురుస్తున్న వాన

పలుచోట్ల జోరువాన..
నైరుతి రాకతో తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి రాష్ట్రంలోని పలుచోట్ల వర్షం కురిసింది. మహబూబాబాద్, ములుగు, వరంగల్‌ అర్బన్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11.5 నుంచి 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్, ఖమ్మం జిల్లాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. గురువారం వరకు తెలంగాణలో 142 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మంథనిలో అత్యధికంగా 40.3 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాతోపాటు…  8 జిల్లాల్లో 39 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్లగొండలో 34.2, హైదరాబాద్‌లో 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

నియంత్రిత సాగుపై అవగాహన
ఈ వానకాలం నుంచి నియంత్రిత వ్యవసాయం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల వరి, పత్తి, కందితోపాటు జొన్న, చెరకు, పెసర, సోయాబీన్‌, మినుము, ఆముదం, వేరుశనగ తదితర పంటలు సాగు చేసే వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పత్తి, కంది విస్తీర్ణం పెంచాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.