Breaking News

ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

సారథి న్యూస్, కర్నూలు: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఆ పేరు చెబితేనే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. కరోనాతో చనిపోయారని వింటేనే చాలు .. రక్తపంచుకు పుట్టినవారు, ఆప్తులు, బంధువులు, నా.. అనే వారు ఎవరూ ముందుకురావడం లేదు. కానీ ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. అందరిలోనూ ధైర్యం నింపేలా.. కరోనా భూతంపై అవగాహన కల్పించేలా ముందుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్.

కోవిడ్ బారినపడి మృతిచెందిన ఓ అనాథ డెడ్​బాడీకి నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్నహిందూ శ్మశానవాటికలో ఆయన స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. కరోనాతో మృతిచెందిన వారి పట్ల మానవత్వంతో మెలగాలని, ఆ మృతదేహాల వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం లేదని ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ తేల్చిచెప్పారు. ఎవరూ ముందుకు రాకపోయినా కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బందితో పాటు వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.