Breaking News

అది బీజేపీ ఎన్నికల వ్యూహమేనా?

అది బీజేపీ ఎన్నికల వ్యూహమేనా?

సారథి న్యూస్, హైదరాబాద్: తాము చేయాల్సిన పని చేయకుండా ఇతరులపై నిందలు మోపడం బీజేపీకి కొత్తేమీకాదు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సి.కిషన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భావించవచ్చు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్​లో ఉందని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న ఆయన కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయాలూ చేయలేదన్న విషయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటీలేటర్లు అడిగితే కేవలం 50 ఇచ్చి చేతులు దులుపుకున్న మోడీ సర్కార్.. కరోనా ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదిల్చింది శూన్యం. మాస్క్​లు, పీపీఈ కిట్ల విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఈ అంశాలపై సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఇదే అదనుగా బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.


చిత్తశుద్ధి ఉంటే..
నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే…కరోనాను అరికట్టడంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని చెప్పడం వరకే కాకుండా చేతల్లో తామేం చేయగలమో నిరూపించాల్సింది. ముఖ్యంగా తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టెస్టులు నిర్వహించాల్సింది. ఆస్పత్రుల్లో కావాల్సినన్ని పడకలు సమకూర్చి వెంటీలేటర్లు, మాస్క్​లు, మందులను అందుబాటులో ఉంచాల్సి ఉంది. హెల్త్​ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను తన అధీనంలోకి తీసుకుని, ప్రైవేట్ ​మెడికల్ కాలేజీలను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకుని, తద్వారా తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించాల్సింది. కానీ ఆ పని మాత్రం బీజేపీ కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గానీ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఎన్నికల కోసమేనా?
త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ ఇలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన చేతిలో ఉన్న అధికారాలను వినియోగించకుండా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. పోనీ బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, దానికి మద్దతునిస్తూ తమిళనాడును పాలిస్తున్న అన్నాడీఎంకే ఏలుబడిలోనైనా కరోనా కట్టడికి నిర్దిష్ట చర్యలేమైనా తీసుకున్నారా? అంటే అదీ లేదు. ఆయా రాష్ట్రాల్లో అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవేమీ పట్టించుకోని బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే పనిగా టీఆర్ఎస్ పై విరుచుకుపడడం వెనక రాజకీయ సమీకరణాలే దాగున్నాయని రాజకీయ విశ్లేషకులు, నాయకులు భావిస్తున్నారు.