- ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం
- నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్ దిగింది. వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్ కేజీవ్రాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అధికారులతో సమీక్ష అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం సన్నద్ధతతో ఉందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కొవిడ్ ప్రొటోకాల్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే ఢిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్ లను మూసివేస్తారు. ప్రైవేట్ఆఫీసులు 50శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలి. అత్యవసర సర్వీసులైన మీడియా, బ్యాంకులు, బీమా, టెలికాం కంపెనీలకు మినహాయింపు ఇచ్చారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20కు పరిమితం చేశారు. మాల్స్, ఇతర దుకాణాలను సరి,బేసి విధానంలో తెరవాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి 8 గంటల వరకే కార్యకలాపాలు కొనసాగించాలి. ఆన్ లైన్ డెలివరీలకు మినహాయింపు ఇచ్చారు. రెసిడెన్షియల్ కాలనీల్లోని షాపులు, మార్కెట్లు సరి,బేసి విధానం పాటించాల్సిన అవసరం లేదు. బార్లు, రెస్టారెంట్లు 50శాతం కెపాసిటీ మేరకే పనిచేయాలి. ఢిల్లీ మెట్రోలో సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది ప్రయాణికులకే అనుమతి ఉంటుంది. ఆటోలు, ఈ రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. సెలూన్లు, బార్బర్ షాపులు, పార్లర్లు తెరిచి ఉంటాయి. పబ్లిక్ పార్కుల్లోకి ప్రజలను అనుమతించినా పిక్నిక్, పార్టీలకు అనుమతిలేదు. రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు.