బిజినేపల్లిలో ఉత్కంఠగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ
నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే
మరోసారి కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
ఇది వరకే తొలగింపు.. నాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి సమక్షంలో బిజినేపల్లి మండల కేంద్రం నుండి వెలుగొండ గేటు సమీపం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మళ్లీ తొలగించారు.
శనివారం తొలగించిన ఫ్లెక్సీల విషయమై మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, మళ్లీ గుర్తు తెలియని దుండగులు బిజినేపల్లి నుండి వెలుగొండ గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఉన్న 9 ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదంగా మారుతుంది. ఓ వైపు ఫ్లెక్సీల తొలగింపు పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా కూడా తగ్గకుండా రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా ఒక వర్గం వారు ఇలాంటి చర్యలు చేస్తున్నారని ఇప్పటికే మండల వ్యాప్తంగా గుసగుసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నా మరోపక్క దుండగులు ఫ్లెక్సీల చించివేతపై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.