- శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా..
- ఉద్యోగులకు వర్క్‌ఫ్రంహోం వెసులుబాటు
- కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం రాత్రి పదిగంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే ప్రజారవాణాపై ఆంక్షల్లో కూడా మార్పులు చేశారు. బస్సులు, మెట్రోలు పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ఆఫీసుల్లో 50శాతం సామర్థ్యంతో ఉద్యోగులు హాజరుకావాలని తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన ఆదేశాలు జారీచేశారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజుల పాటు ఐదుశాతం కంటే ఎక్కువగా నమోదు కావడంతో యాక్షన్ ప్లాన్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ప్రతి వంద టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నివేదించింది. సోమవారం 24 గంటల్లో 4,099 కొత్త కేసులు, ఒక మరణం నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. జనవరి 15వ తేదీ నాటికి ఢిల్లీలో రోజుకు 20 నుంచి 25వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇక్కడ ఇప్పటికే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సినిమా హాళ్లు, జిమ్‌లను మూసివేశారు. అదేవిధంగా దుకాణాలను సరిబేసి ప్రాతిపదికన అనుమతించనున్నారు.