Breaking News

టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు
  • దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు
  • పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలు
  • చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గంలో రూ.3.6 కోట్లు, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారని నిర్ణయించారు. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తరహాలోనే వెనకబడిన ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచితంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. వేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు స్థలాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రి నిర్మాణం చేప‌డ‌తారు. అందుకోసం ఎస్వీ ప్రాణ‌దాన ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాత‌ల‌కు ఉద‌యాస్తమాన సేవా టికెట్లు కేటాయించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

కీలక నిర్ణయాలు

 భక్తుల తలనీలాలు తీసే కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్‌ ఒక్కింటికి రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం తెలిపారు. ధార్మిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్రముఖ న‌గ‌రాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. రూ.3 కోట్ల వ్యయంతో యాత్రికుల సౌకర్యార్థం తిరుమలలోని ఏఎన్సీ, జీఎన్సీ, హెచ్‌ వీసీ తదితర విశ్రాంతి గృహాల్లో వాటర్‌ హీటర్లు ఏర్పాటుకు టెండర్లకు ఆమోదం తెలిపారు. వైఎస్సార్​క‌డ‌ప జిల్లా రాజంపేట స‌మీపంలోని అన్నమ‌య్య డ్యామ్ ప‌రీవాహ‌క ప్రాంతంలో ధ్వంస‌మైన ఏడు ఆల‌యాలను పున‌ర్​నిర్మించనున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్‌ లో సెంట్రల్‌ గోడౌన్‌ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. రూ.12.58 కోట్లతో పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలోని హరిణి హాస్టల్‌ బ్లాక్‌ లో అదనపు అంతస్థుల నిర్మాణం, శ్రీనివాస, గాంధీ హాస్టళ్లలో గదులను ఆధునీకరణ చేసేందుకు టెండర్లకు ఆమోదం తెలిపారు. రూ.2.80 కోట్లతో తిరుమలలో నిర్మాణంలో ఉన్న పరకామణి భ‌వ‌నంలో నాణేలను లెక్కించి ఆటోమేటిక్‌గా ప్యాకింగ్‌ చేసేందుకు వీలుగా రెండు యంత్రాల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. శ్రీశైలంలోని శ్రీశైల దేవస్థానం శివాజీ గోపురానికి రాగి కళశాలపై బంగారు తాపడం చేసి అందించేందుకు ఆమోదం తెలిపారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.