- మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక
- 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి
- పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
- ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు
- ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు
- ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్
జిల్లా కలెక్టర్పి.ఉదయ్ కుమార్
సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో దళితబంధు అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘సామాజికసారథి ప్రతినిధి’కి ప్రత్యేకంగా వివరించారు.
సామాజికసారథి: రైతుబంధు నాగర్కర్నూల్ జిల్లాలో ఎలా అమలు చేస్తున్నారు?
కలెక్టర్: తొలుత జిల్లాలోని చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఇప్పుడు దళితబంధు పథకాన్ని జిల్లా అంతటా అమలుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
సామాజికసారథి: కొన్ని గ్రామాల్లోనే లబ్ధిదారులను ఎంపికచేచేస్తారని ప్రచారం జరుగుతోంది కదా?
కలెక్టర్: జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారందరికీ దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం.
సామాజికసారథి: లబ్ధిదారుల ఎంపిక, పర్యవేక్షణ ఎలా ఉంటుంది?
కలెక్టర్: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు రెవెన్యు డివిజన్ అధికారులను నియమించి పథకం అమలును పర్యవేక్షిస్తున్నాం. ఆయా మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవోలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ప్రత్యేకాధికారులు ఆయా దరఖాస్తుదారులు అర్హులైన వారా? కాదా? అని పరిశీలిస్తారు. ఎంపీడీవో, తహసీల్దార్ల ద్వారా ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తాం.
సామాజికసారథి: దళితబంధు నిధులను లబ్ధిదారులు ఎలా సద్వినియోగం చేసుకుంటారు?
కలెక్టర్: లబ్ధిదారులు ఎంపికచేసిన యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ద్వారా ఉంటుంది. వారు ఎంచుకున్న విభాగానికి సంబంధించిన యూనిట్ కు ఆయా శాఖాధికారులు సమగ్రంగా విచారిస్తారు. ఆ యూనిట్ నెలకొల్పేందుకు గల పరిస్థితులను స్టడీ చేస్తారు. ఆయా యూనిట్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి జిల్లా ఎస్సీ సంక్షేమశాఖకు సమర్పిస్తారు. అనంతరం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ ఉంటుంది. పెట్టిన ప్రతి యూనిట్ కొనసాగేలా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం.
సామాజికసారథి: ఎన్ని అర్హులైన కుటుంబాలను గుర్తిస్తున్నారు.. గ్రౌండింగ్ ఎప్పటివరకు చేస్తారు?
కలెక్టర్: మొదట జిల్లాలో అర్హులైన 300 కుటుంబాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కొల్లాపూర్లో 62, నాగర్ కర్నూల్లో 100, కల్వకుర్తిలో 38, అచ్చంపేటలో 100 అర్హులైన కుటుంబాలను గుర్తిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ జనవరిలో ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తిచేస్తాం.
సామాజికసారథి: లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం లేదా?
కలెక్టర్: ప్రభుత్వ నిర్దేశం మేరకు నిబంధనల పరిధిలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి రాజకీయ ప్రమేయం, ఒత్తిడి ఉండదు. ప్రస్తుతం జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఎంపికైన వారికి వెంటనే సదస్సులు నిర్వహించి వారికి యూనిట్ల నెలకొల్పే విధంగా సరైన శిక్షణ ఇస్తాం.