Breaking News

ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే ఉంటా

ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే కొనసాగుతా

  • తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు
  • క్లారిటీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్​రావు
  • టీఆర్ఎస్​ కార్యవర్గ సమావేశంలో వెల్లడి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని టీఆర్ఎస్​అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎంగా తానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులు, శాసనసభ్యులకు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పునరుద్ఘాటించారు.

సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

11న కార్పొరేటర్లు తెలంగాణ భవన్ కు రావాలె
ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమకు ఎవరూ పోటీ లేరని పేర్కొన్నారు. ఈనెల 11న గెలిచిన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్​రావు, మహమూద్​ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, జి.జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్​, మంత్రులు, ఎంపీలు