- ప్రతిపనికి కమిషనర్, సిబ్బంది చేతివాటం
- మధ్యవర్తుల ద్వారా వసూళ్లపర్వం
- బోగస్ బిల్లులు పెట్టించి అమ్యామ్యాలు
- చిన్నాచితక లీడర్లతో సెటిల్ మెంట్లు
- మాటవినని సిబ్బందికి మెమోలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు మున్సిపాలిటీ అవినీతి కంపు రాజ్యమేలుతోంది. కంచె చేను మేసిందన్న చందంగా మున్సిపాలిటీకి జవాబుదారీగా ఉండాల్సిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కొందరు స్టాఫ్ తో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మున్సిపాలిటీలో తన మాటవినని కిందిస్థాయి సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీచేయడం పరిపాటిగా మారింది. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పని జరిగినా కమిషనర్ తనవంతు పర్సెంటేజీ తనకు వచ్చేలా చూసుకుంటున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో తన అవినీతి, అక్రమాలు, కమీషన్ వసూళ్లకు ఏకంగా ఓ పత్రిక(‘సామాజికసారథి’కాదు)కు చెందిన ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని దర్జాగా తన దందా కొనసాగిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులకు పట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఆ ప్రైవేట్ వ్యక్తి మున్సిపాలిటీ పరిధిలో చీమ చిటుక్కుమన్నా, విలేకరులు విజిటింగ్ చేసినా ప్రజాప్రతినిధులు పరిశీలించేందుకు వచ్చినా.. క్షణాల్లో మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి విషయం చేరవేయడమే కాదు చిన్నా చితకా లీడర్లను తన పరిధిలోనే సెటిల్ మెంట్ చేస్తూ విషయం బయటికి పొక్కకుండా చేస్తున్నారనే విషయం వెలుగుచూసింది.
దర్జాగా అవినీతి, అక్రమాలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రం నుంచి నాలుగు దిక్కులా వివిధ రకాల చిన్న, పెద్ద వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో పట్టణానికి నాలుగు వైపులా వివిధ రకాల షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసేందుకు మున్సిపల్ సిబ్బంది భారీగా కమీషన్ వసూలు చేసినట్లు తెలిసింది. పైగా, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా రోడ్లల్లో షెడ్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తే అసలు షెడ్లు ఉన్న సంగతే తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ బుకాయించడం విశేషం. మున్సిపాలిటీ పరిధిలో ఔట్ సోర్సింగ్, తాత్కాలిక సిబ్బంది, ఇతర ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా బోగస్ బిల్లులు పెట్టించడం, ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోళ్లు, ఇతర వాహనాల డీజీల్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల బోగస్ లెక్కలు, వాటర్ ట్యాంక్ లేకున్నా ఉన్నట్లు ఇలా ఒక్కటేమిటీ ఏ బిల్లుల్లో అయినా తన కమీషన్ల కోసం అడ్డగోలుగా బిల్లులు పెట్టించి అవినీతికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మాటవినని వారికి మెమోలు
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో అకౌంటెంట్లు, ఇంకా కొందరి సిబ్బంది సహకారంతో దర్జాగా బోగస్ బిల్లులతో అందినకాడికి దండుకుంటున్న మున్సిపల్ కమిషనర్ తన మాట వినని సిబ్బందిని మెమోలతో హడలెత్తిస్తున్నారు. ఇటీవల కొన్ని బోగస్ బిల్లులకు సంతకం చేయకుండా ఉన్నాడనే కారణంతో ఓ కింది స్థాయి సిబ్బందికి మెమోలు జారీచేసి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి ఏదైనా బిల్లు ప్రాసెస్ చేయాలంటే ఆయా సెక్షన్ల అధికారులతో పాటు ఉన్నతాధికారుల సంతకాలతో బిల్లులు పాసవుతుంటాయి. కానీ ఇక్కడ కేవలం తన మాట వినని కిందిస్థాయి సిబ్బందికి తప్పుడు మెమోలు జారీచేసి వారిని మానసికంగా వేధిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ విషయమై ‘సామాజికసారథి’ ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ ను ఫోన్ లో వివరణ కోరేందుకు యత్నించగా స్పందించలేదు.