Breaking News

ఇండిగో విమానం చుక్కలు చూపింది

ఇండిగో విమానం చుక్కలు చూపింది
  • తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండింగ్‌
  • సాంకేతికలోపం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
  • ఇబ్బందులుపడ్డ రోజా, యనమల, జోగీశ్వరరావు

తిరుపతి: ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన ఫ్లైట్​గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.20గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరిన ఫ్లైట్​ఉదయం 10.20కు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. సాంకేతికలోపం కారణంగా గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండ్‌ అయింది. రెండు గంటలుగా ప్రయాణికుల విమానంలోనే ఉన్నారు. విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారని తెలిపారు. కానీ అక్కడ అనుమతి ఉందో లేదో తెలియదని తెలిపారు. డోర్లు కూడా ఓపెన్‌ చేయలేదని రోజా అన్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. కింద ల్యాండ్‌ కనిపించడం లేదని అధికారులు తెలిపారని అన్నారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో విమాన సంస్థపై నష్టపరిహారం కేసు పెడతామన్నారు. తిరుపతిలో దించకుండా బెంగళూరులో దించారని ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.ఐదువేలు డిమాండ్‌ చేశారని రోజా అన్నారు. ఇక విమానంలో సమస్యలపై యాజమాన్యం సరిగా స్పందించలేదని, వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.