Breaking News

దేశానికే తెలంగాణ రోల్ మోడల్

మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం

Further strengthen the marketing department

  • మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం
  • వ్యవసాయశాఖ పొలం.. హలం శాఖగా మారాలి
  • రైతు వేదికలను వాడుకలోకి తీసుకురావాలి
  • పంటసాగు విధానంలో మార్పు రావాలి
  • వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశం

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. వ్యవసాయశాఖ కాగితం కలం శాఖగా కాకుండా పొలం.. హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని సూచించారు. మార్కెటింగ్ ​శాఖను మరింత బలోపేతం చేస్తామని స్పష్టంచేశారు. ప్రగతిభవన్ లో ఆదివారం జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్​ కుమార్, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని స్పష్టంచేశారు. పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంపై సరైన లెక్కలు తీయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వాడుకలోకి తీసుకురావాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు.
ఎన్నో అద్భుత విజయాలు సాధించాం
తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని సీఎం కేసీఆర్​వివరించారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. రెవెన్యూలో అత్యంత జఠిలమైన సమస్యలను పరిష్కరించుకున్నామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను సులభతరం చేసుకున్నామని చెప్పారు. రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలని, పంట మార్పిడి విధానం రావాలని సీఎం కేసీఆర్​సూచించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు, మంత్రులు, ఇతర ముఖ్య​ అధికారులు

రైతులకు మార్కెట్లే కీలకం
రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక, రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​స్పష్టం చేశారు. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తోంది.. అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉందనే వివరాలను సేకరించాలన్నారు. మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.