సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం తెలుగు అధ్యాపకుడు, ప్రముఖకవి శేషం సుప్రసన్నాచార్యులు రచించిన ‘హిమాలయాలకు చెమట పడుతుంది’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కరీంనగర్ అడినషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసన్న కవిత్వంలో అనేక సామాజికాంశాలు ఉండటమే కాకుండా వారు నేర్చుకున్న సంస్కృతభాష ప్రభావం, పురాణేతిహాసాల ప్రయోగాలు విస్తృతంగా ఉన్నాయని, పదప్రయోగం అనిర్వచనీయమని కొనియాడారు. పుస్తక పరిచయకర్త, తెలంగాణ పాఠ్యపుస్తకాల రచయిత నంది శ్రీనివాస్ ఆచార్యుల వారి కవిత్వంలో విశిష్టమైన పదప్రయోగ కుశలత అవినీతి అక్రమాలు మూఢాచారాలను వ్యంగ్యంగా విమర్శించిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రముఖకవి అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ.. ‘హిమాలయాలకు చెమటపడుతుంది’ అని పుస్తకం టైటిలే పాఠకుడిని ఆలోచింపజేస్తుందన్నారు.
సీనియర్ పాత్రికేయులు ఫజుల్ రెహమాన్ మాట్లాడుతూ.. ప్రతి ఆలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉన్నట్లే సమాజమనే దేవాలయానికి కవి క్షేత్రపాలకుడని అభివర్ణించారు. ప్రముఖకవి, శతాధిక కరపత్రరూపకర్త, ప్రముఖకవి వైరాగ్యం ప్రభాకర్ మాట్లాడుతూ శేషం వారి కవిత్వం సర్వజనామోదమైందని, అపార పాండిత్యం ఆయన కవిత్వంలో ఉంటుందన్నారు. పుస్తక రచయిత శేషం సుప్రసన్నాచార్యులు తన కవితల్లోని ధర్మాన్ని, మర్మాన్ని వివరించారు. అనంతరం భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో అతిథులు సన్మానించారు. శేషం రామచంద్రమూర్తి అతిథులకు స్వాగతం పలకగా, లక్ష్మణ్ వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.