Breaking News

రాజ్యసభలో 12 ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

12 మంది ఎంపీల సస్పెన్షన్

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపిస్తారు. సభ ప్రారంభం నుంచీ విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో పలుమార్లు సభ వాయిదాపడింది. మరోసారి గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు 12 మంది ఎంపీలపై సస్పెన్షన్​వేటు వేశారు. ఎలమరం కరీం(సీపీఎం), బినోయ్‌ విశ్వం(సీపీఐ), డోలాసేన్‌, శాంతఛత్రీ(టీఎంసీ), ప్రియాంక చతుర్వేది, అనిల్‌ దేశాయ్‌(శివసేన)తోపాటు కాంగ్రెస్‌ కు చెందిన ఫూలోదేవి నేతమ్‌, ఛాయావర్మ, రిపున్‌ బోరా, రాజమణి పటేల్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌ ను సస్పెండ్‌ చేస్తూ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత వర్షాకాల సమావేశాల్లోనూ రాజ్యసభ చైర్మన్‌ను కించపరిచారని పలువురిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.