సామాజిక సారథి, భువనగిరి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపై ధర్నాలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెంలో ఏర్పాటుచేసిన ‘బహుజన మేలుకొలుపు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని, ప్రజలను మోసం చేస్తూ నియంతపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వడ్లను కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులుగాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ రైతు ధాన్యం రాశిపైనే ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమన్యాయం కోసం, రాజ్యాధికారంలో బహుజనుల వాటా కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టి ఏనుగు గుర్తుకు ఓట్లేసి బీఎస్పీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం భువనగిరి మండలం బొల్లేపల్లి, భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లిలో బీఎస్పీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు వివిధ పార్టీల నుంచి బీఎస్పీలో చేరారు.