– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు
– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు
– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్ మెంట్ చేసినట్లు వెలుగులోకి
– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్ భూమ్ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్జన చేస్తున్నారు. బిజినేపల్లి మండలంలో కబ్జాదారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారంరోజుల క్రితం లింగసానిపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్ 177లో భూబకాసురులు ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్నారని ‘సామాజికసారథి’లో పలు వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వార్తకు స్పందించిన మండల తహసీల్దార్ అంజిరెడ్డి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ భూములు కొనుగోలుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అదే సర్వేనెంబర్ లోని ప్రభుత్వ భూముల్లో ఒకే వ్యక్తికి లింగసానిపల్లి గ్రామంలో 34 ఇల్లు ఉన్నట్లు గ్రామపంచాయతీ అసైన్ మెంట్ నెంబర్ తో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. 2022 నవంబర్ 7న ఓ గిరిజన సర్పంచ్ భర్త పేరుతో ఏకంగా 34 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పత్రాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారులు ఏమంటున్నారు?
ఈ విషయమై గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రసన్నకుమారిని సంప్రదించగా ఆ పత్రాలను పరిశీలించి గ్రామపంచాయతీ నుండి అసైన్ మెంట్ చేయలేదని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తేటతెల్లమైంది. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవో కృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, గ్రామాల్లో ఇటీవల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కంప్యూటర్ ను ఏర్పాటుచేసి ఇళ్లను ఆన్ లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇదే అదునుగా భావించి లింగసానిపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 177లోని ప్రభుత్వ భూమిలో హద్దులను ఏర్పాటుచేసి సర్పంచ్, గ్రామపంచాయతీవార్డు సభ్యులు, కార్యదర్శికి తెలియకుండానే గ్రామంలో లేని 34 ఇళ్లను అసైన్ మెంట్ నెంబర్లను ఏర్పాటుచేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడం చూసి అధికారులు కంగుతింటున్నారు. ఈ భూముల విలువ కోట్లలో ఉంటుంది. ఏదేమైనా నకిలీ స్టాంపులు పుట్టించి ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అమాయక ప్రజలకు దోచుకుంటున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.