Breaking News

ప్రభుత్వ భూమికి ఎసరు రూ.కోట్ల విలువైన భూములపై కన్నేశారు

– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు
– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు
– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్​ మెంట్​ చేసినట్లు వెలుగులోకి
– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ
– పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్​ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్​ భూమ్​ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్జన చేస్తున్నారు. బిజినేపల్లి మండలంలో కబ్జాదారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారంరోజుల క్రితం లింగసానిపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్​ 177లో భూబకాసురులు ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్నారని ‘సామాజికసారథి’లో పలు వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వార్తకు స్పందించిన మండల తహసీల్దార్​ అంజిరెడ్డి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ భూములు కొనుగోలుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అదే సర్వేనెంబర్ లోని ప్రభుత్వ భూముల్లో ఒకే వ్యక్తికి లింగసానిపల్లి గ్రామంలో 34 ఇల్లు ఉన్నట్లు గ్రామపంచాయతీ అసైన్​ మెంట్​ నెంబర్​ తో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. 2022 నవంబర్ 7న ఓ గిరిజన సర్పంచ్ భర్త పేరుతో ఏకంగా 34 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసులో పత్రాలు వెలుగులోకి వచ్చాయి.

అధికారులు ఏమంటున్నారు?
ఈ విషయమై గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రసన్నకుమారిని సంప్రదించగా ఆ పత్రాలను పరిశీలించి గ్రామపంచాయతీ నుండి అసైన్​ మెంట్​ చేయలేదని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తేటతెల్లమైంది. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవో కృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, గ్రామాల్లో ఇటీవల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కంప్యూటర్​ ను ఏర్పాటుచేసి ఇళ్లను ఆన్​ లైన్​ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇదే అదునుగా భావించి లింగసానిపల్లి గ్రామంలోని సర్వేనెంబర్​ 177లోని ప్రభుత్వ భూమిలో హద్దులను ఏర్పాటుచేసి సర్పంచ్​, గ్రామపంచాయతీవార్డు సభ్యులు, కార్యదర్శికి తెలియకుండానే గ్రామంలో లేని 34 ఇళ్లను అసైన్​ మెంట్​ నెంబర్లను ఏర్పాటుచేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడం చూసి అధికారులు కంగుతింటున్నారు. ఈ భూముల విలువ కోట్లలో ఉంటుంది. ఏదేమైనా నకిలీ స్టాంపులు పుట్టించి ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అమాయక ప్రజలకు దోచుకుంటున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.