ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల వెట్టిచాకిరిత్రీమెన్ కమిటీ ద్వారా ఎంపికైనా ఉద్యోగ భద్రత కరువునెలల తరబడి జీతాలు రాక రోడ్డున పడుతున్న గెస్ట్ లెక్చరర్లుకొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఎదురుచూపులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:12గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు మిగిలిన జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీ కి నోటీఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడంతో ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని పనిచేస్తున్న తమ కుటుంభాలను రోడ్డున పడేయ్యవద్దని తమను కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ మాత్రమే ఉంటుందని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, గెస్ట్ పద్దతులలో నియామకాలు ఉండవని అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి అమలు కాలేదు. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల తో సమానంగా విద్యార్హతలు ఉన్నా గెస్ట్ లెక్చరర్ల పేరుతో గత ప్రభుత్వం ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో వెట్టిచాకిరీ చేయించుకుంది. సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వాలు పట్టింఛుకోకపోవడంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు శ్రమదోపిడికి గురవుతూనే ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా తమ జీవితాల్లో మార్పు వస్తుందేమోనన్న గంపెడాశతో గెస్ట్ లెక్చరర్లు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తమ గోస ను పట్టించుకొని తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు చెల్లించి రోడ్డున పడుతున్న తమ కుటుంభాలను ఆదకుంటారని గెస్ట్ లెక్చరర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొత్త ప్రభుత్వంపై కోటీ ఆశలు…
గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పీజీ లు, బీఈడీ లు చేసి రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను ఆదుకోవాలని గెస్ట్ లెక్చరర్లు కొత్త ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ పద్దతిలో లెక్చరర్లను నియమించడం, వారి జీతాల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉండడం ఇంటర్ విద్యకు శాపంగా మారింది. పేరుకు గెస్ట్ లెక్చరర్లుగా నియమించినా కాలేజీ ప్రారంభం మొదలుకొని ముగిసే వరకు విధులు నిర్వహిస్తున్నా గెస్ట్ లెక్చరర్లకు ఇచ్చేది అరకొర వేతనాలు కావడం అది కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం మరింత అధ్వాన్నంగా మారింది. జూనియర్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంతో తమకు కూడా న్యాయం జరుగుతుందన్న ఆశతో గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లు సైతం కాంట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే త్రిమెన్ కమిటీ ద్వారా ఎంపిక కావడంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని , నెలనెల ఫిక్స్ డ్ శాలరీలు ఇవ్వాలని అవికూడా అందరితో సమానంగా 12 నెలల వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు. కాని గత ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పై కనీస కనికరం కూడా చూపకుండా కొత్త నోటిఫికేషన్ ద్వారా కొత్త వారిని భర్తీ చేసుకోవాలని ప్రయత్నించడం, గెస్ట్ లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించి ఇదివరకు పనిచేసిన వారినే కొనసాగించాలని వారు లేని చోట కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని నియమించుకోవాలనే విధంగా ఆర్డర్ తెచ్చుకుని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకు గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు చెల్లించకపోవడం మరింత బాధాకరం. పైగా గెస్ట్ లెక్చరర్లకు పీరియడ్ల లెక్కన ఎన్ని రోజులు పనిదినాలు ఉన్నా కేవలం 72 పీరియడ్లకే జీతాలు చెల్లిస్తామని నిర్ణయించడం ప్రభుత్వ అహంకార తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో పాటు ఎన్నికల్లో లబ్ధికోసం కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆగమేఘాల మీద రెగ్యులరైజ్ చేయడం మిగిలిన ఖాళీ పోస్టులలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడం తో ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఇంటికి పంపే ఆలోచనలో గత ప్రభుత్వం ఉండడంతో గెస్ట్ లెక్చరర్లు వణికిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రజా వాణి కార్యక్రమంలో కలిసి తమ సమస్యలను విన్నవించుకొని న్యాయం చేయాలని కోరేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, మంత్రులకు తమ పరిస్థితిని చెప్పి త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు.