సారథి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధునుపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్ట మధుపైనా సీఎం కేసిఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం సాగింది. పుట్ట మధును భీమవరం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలించారు.
ఏ కేసులో అరెస్ట్ చేశారు?
ఆయనను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. పుట్ట మధు ప్రధాన అనుచరుడు ఒకరిని ఈ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్ట మధును కూడా ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతారనే చర్చ జరుగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు భీమవరంలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తదితర విషయాలు తెలియాల్సి ఉంది.