Breaking News

25 వరకు పల్స్ పోలియో

25 వరకు పల్స్ పోలియో

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో జనవరి 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 0-5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేస్తారన్నారు. 23న ఏర్పాటుచేసిన బూత్ లలో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ నెల 23న పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు 24, 25 వ తేదీలలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చుక్కలు వేస్తారని తెలిపారు.  జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు 1,86,190 మంది ఉన్నారని,  జిల్లా వ్యాప్తంగా 1,119 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేశామని, అందులో 922 గ్రామీణ ప్రాంతాల్లో, 197 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08455-274824) ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా పీహెచ్ సీ  స్థాయిలో కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు.