Breaking News

స్కూళ్లు తెరిచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి

స్కూళ్లు తెరిచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు. మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్‌ బియ్యాన్ని వాడొద్దని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. స్కూళ్లకు వచ్చే విద్యార్థుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించారు.
మే 17 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్
మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,252 స్కూళ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 85శాతం స్కూళ్లను సందర్శించామని వివరించారు. వాటిని ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధచూపుతామని అన్నారు. అలాగే విద్యార్థుల తాగునీటి కోసం మిషన్ భగీరథ వాటర్‌ను అందిస్తామని పేర్కొన్నారు‌. ప్రతి విద్యార్థికి పుస్తకాలను తక్షణమే అందిస్తామని మంత్రి ప్రకటించారు. యూనిఫామ్స్​కూడా కొత్తవాటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాలో 85 శాతం మంది విద్యార్థులు డిజిటల్ క్లాసులు వింటున్నారని ఆమె తెలిపారు. 4 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మే 15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.