Breaking News

పాటల్లో పవర్​ ఉంది.. జీవితాలను మార్చాలే

పాటల్లో పవర్​ ఉంది.. జీవితాలను మార్చాలే


  • కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలె
  • ఎన్నో అడ్డంకులు వచ్చినా జ్ఞానమార్గాన్ని వీడొద్దు
  • గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​
  • అలరించిన ఆరో స్వేరో స్వర సునామీ వేడుక

సారథి, హైదరాబాద్: పాటలకు చావులేదని, పాటలు జీవితాలను, సమూహాలను మారుస్తాయని, సమాజంలో మార్పులు తీసుకొస్తాయని, చరిత్ర గతినే మారుస్తాయని స్వేరోస్​ఆర్గనైజేషన్​ఫౌండర్, గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​అభివర్ణించారు. పాటలు ప్రపంచానే మారుస్తాయని, స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాయని గుర్తుచేశారు. పాటలే అధికారాన్ని కూడా తీసుకొస్తాయని పునరుద్ఘాటించారు. ఇందుకు ‘వందేమాతరం’, ‘బండెనుక బట్టి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే వస్తవ్​ కొడుకో నైజాం సర్కారోడా..’ అనే పాటలను ఉదాహరించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో స్వేరోస్​నిర్వహించిన 6వ స్వర సునామీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ.. పాటలే బాంచన్ ​కాల్మోక్తా! అనే స్థాయి నుంచి చిన్నారి పాదాలు ఎవరెస్ట్​ఎక్కేంతవరకు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కొన్ని పాటలు మన జీవితాలను ప్రభావితం చేశాయని, కొందరిని చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసుకునేలా, సూసైడ్ ​చేసుకునేలా ప్రేరేపించాయని గుర్తుచేశారు. ఇక వాటికి కాలం చెల్లిందన్నారు. జ్ఞానం, సామాజిక దృక్పథం వైపు పాటలు, కవిత్వం, రచనలు సాగాలని ఆకాంక్షించారు. బిడ్డలు గర్భంలోనే ఉన్నప్పటి నుంచే మహనీయుల చరిత్ర, వారి త్యాగాలు పాటల రూపంలో తెలిజేయాలన్నారు. వారికి గొప్ప భవిష్యత్​ను అందించాల్సిన బాధ్యత కూడా ఉండదని ఉద్బోధించారు. పాటలతోనే పిల్లలను పెంచాలని, మన పాటలన్నీ గుడిసె గుండెదాకా వెళ్లాలని కోరారు. పేద సామాజికవర్గాలకు చదువు రాలేదని, రానివ్వలేదన్నారు. కానీ కాలం మారిందని, రాబోయే రోజుల్లో రూ.వెయ్యి కోట్లతో ఇల్లును మన బిడ్డలు కూడా కొంటారని ధీమా వ్యక్తంచేశారు. లక్ష్యం మీద స్పష్టత ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరన్నారు. ఇక స్వేరో సునామీలు ఏడాదికి రెండు మూడు చొప్పున నిర్వహించాలని కోరారు.

కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలి
కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలని డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ తమ అమ్మలు, అవ్వలు యాభై ఏళ్లలోనే చనిపోతున్నారని, వారి స్థితిగతులపై రీసెర్చ్​చేయాలని ఓ ప్రొఫెసర్​కు హితవుపలికారు. విజ్ఞానం పంచుతున్న ఈ పాటల్లో ఎక్కడైనా దేశద్రోహం ఉన్నదా? మత మార్పిడి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ పాటల్లో కవిత్వం ఉందని, ఈ దేశాన్నిగొప్పగా పాలించమని ఉన్నది తెలిపారు. మనంపై రాళ్లు వేస్తున్న అలాంటి వారి నోళ్లను పాటలతో మూసివేయించాలని కవులు, రచయితలను కోరారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా మనం ఎంచుకున్న జ్ఞానమార్గాన్ని విడిచిపెట్టేది లేదని స్పష్టంచేశారు.

రచయితలపై ప్రశంసల జల్లు
మలినం ఎత్తుతున్న పారిశుద్ధ్య కార్మికుల స్వేదాన్ని సుగంధంతో పోల్చి డాక్టర్​శ్రీకాంత్​ అద్భుతమైన పాట రాశానని గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ప్రశంసించారు. అలాగే ఆరో స్వర సునామీ పాటల రచయితలు కిరణ్​ కుమార్​, రేలారే ప్రసాద్, మానుకోట ప్రసాద్, యాచారపు రాంబాబు, ఆదేశ్​రవిని మెమోంటోలతో సత్కరించారు. అంతకుముందు నీటి, ఎన్​ఐటీ, ఎంబీబీఎస్, బీడీఎస్​ తదితర సీట్లు వచ్చిన గురుకులాల విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్​శాఖ జేడీ లక్ష్మీబాయి, బీసీ గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు, రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి భారత్ భూషణ్, స్వేరోస్​రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్​కుమార్, మాజీ అధ్యక్షుడు ఊషన్న, రిసోర్స్​పర్సన్​సోలపోగుల స్వాములు, రుద్రవరం సునీల్​, చిరంజీవి, పైలాన్​కృష్ణ, దుర్గయ్య పాల్గొన్నారు.