Breaking News

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి
  •  నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద

సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో పనులు చేయిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం ద్వారా, బాల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్ బృందాలు పని చేయాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2015 సంవత్సరం నుంచి 2021 వరకు 15 విడతలుగా జనవరి, జులైనెలలో నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్ పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నామని ఆమె వివరించారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు నడవడం లేదని ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను పనిలో పెడుతున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై భిక్షాటన చేసే చిన్నారులు, దుకాణాలు, హోటల్స్, దాబాలలో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బాలలను పనిలో పెట్టుకున్న వారికి 25,000 జరిమానా విధించాలని చెప్పారు. సమావేశంలో సీఐ సురేష్, బాలల పరిరక్షణ అధికారి గణేష్, ఎస్ఐలు రాంబాబు, శంకరయ్య, రామకృష్ణ, నందూలాల్, జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు భాస్కర్, లక్ష్మీ కిరణ్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్ల ఆపరేషన్ స్మైల్ బృందాల సభ్యులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.