- సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు
- సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతోపాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఇదిలాఉండగా, మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. సామాన్యులకు థియేటర్‌ను బట్టి సరసమైన ధరలకే సినిమా టికెట్ రేట్లను సర్కార్ నిర్ణయించింది. దీనిపై సినీ పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సినిమా టికెట్ల ధరలపై హీరో నాని, సిద్దార్థ్‌లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మాట్లాడేవాళ్లు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టాం. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదు. వీటిని రెన్యువల్ చేసుకోమని ఆనాడే చెప్పాం. అయినా అనుమతులు లేకుండా నడిపారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎవరిపైనో కక్ష ఎందుకు ఉంటుంది. 130 సినిమా హాళ్లపై చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాలో 12 సీజ్ చేశాం. లైసెన్స్ లేని 22 థియేటర్లు మూసివేశాం. 83 థియేటర్లను సీజ్ చేశాం. జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాం. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరులో ఉన్నారో.. ఆయన ఏ కిరాణ కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదు.’ అన్నారు. మరో నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటారు.. ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.