Breaking News

ఒమిక్రాన్ ముప్పు ఉంది

ఒమిక్రాన్ ముప్పు ఉంది
  • డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. గ్రామం వారిగా డ్రైవ్ చేపట్టి వారంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు.  పీహెచ్సీ వారిగా వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. తప్పుడు లెక్కలతో సరిపుచ్చవద్దని, వాక్సినేషన్ వేయించడం ఆయా డాక్టర్లు, అధికారుల బాధ్యత అన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజార్శి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీవో సురేష్ మోహన్, డీఎంహెచ్ఓ గాయత్రీ దేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. శశాంక్, అదనపు పీడీలు, జిల్లా అధికారులు, డీఎల్పీవోలు, రెవెన్యూ  డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తదితరులు పాల్గొన్నారు.