Breaking News

చేసుకో కబ్జా.. వేసుకో కాంప్లెక్స్​

కబ్జా చేసుకో .. కాంప్లెక్స్​వేసుకో!

  • నాగర్​కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ
  • ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు
  • 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్​వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో సాగుతున్న కబ్జా బాగోతం. జిల్లా కేంద్రంలోని పోలీస్​స్టేషన్, జిల్లా కలెక్టరేట్​క్యాంపు ఆఫీసుగా ఎదురుగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ప్రైవేట్​భూమి సర్వే నంబర్​తో ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జాచేశారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయగా సదరు వ్యాపారి, అప్పటి అధికార పార్టీ (కాంగ్రెస్) అండదండలతో కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేపట్టినా ప్రభుత్వ యంత్రాంగం కిమ్మనలేదు. దీంతో ప్రభుత్వ భూమి ఇప్పటికీ ఆ వ్యాపారి ఆధీనంలోనే ఉండిపోయింది. ఇలాంటి వ్యవహారాలకు అండదండల కోసం సదరు వ్యాపారి, అధికారంలో ఉన్న పార్టీతో జత కలిపాడు. నాగర్ కర్నూల్ కేసరి సముద్రంచెరువు ఎఫ్​టీఎల్​పరిధిలో భవన నిర్మాణం చేపట్టినట్లు అతనిపై ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఆక్రమణ జరిగిందిలా..
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్​కార్యాలయం, పొలీస్ స్టేషన్లకు ఎదురుగా ప్రధాన రహదారి మహబూబ్ నగర్, శ్రీశైలం హైవేకు ఆనుకుని పక్కనే ఉన్న 367, 365 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేకున్నా 367 సర్వే నంబర్​లో 6 గుంటలు, 365 సర్వే నంబర్​లో 3 గుంటల భూమి తమదిగా చెప్పుకుని ఆ భూమిని కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి 2000 సంవత్సరంలో విక్రయించారు. 367 సర్వే నం.లో 92 గజాలు ఆ వ్యాపారి భార్య పేర, 31.62 గజాలు మరొకరికి అమ్మి, ఈ రెండు స్థలాలు కూడా వివాదం లేని సర్వే నంబర్​364లో అమ్మినట్లుగా తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత సదరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతుండగా అప్పటి ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి పలుమార్లు అప్పటి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదుచేశారు. దీంతో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి అని తేల్చారు. ఇది ప్రభుత్వ భూమి అని కోర్టు ద్వారా కూడా నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదు. ప్రభుత్వ అవసరాలకు భూమి కొరత ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ భూమిపై దృష్టి పెట్టకపోవడం విచారకరం.

యథేచ్ఛగా అదనపు నిర్మాణం
ఈ ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లో సదరు వ్యాపారి అదనపు నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ఇక్కడ షాపులు నిర్మించగా ఆపై అందులో అదనపు నిర్మాణాలు చేపడుతుంటే ప్రభుత్వ అధికారులు అనుమతులెట్లా ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంత వివాదాస్పద భూమిలో నిర్మాణాలను ఎలా అనుమతిస్తున్నారని అనుమతిస్తున్నారని ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

అధికారి ఏమన్నారంటే..
‘‘జిల్లా కేంద్రంలోని పోలీస్​స్టేషన్​ఎదురుగా ఉన్న సర్వేనెంబర్​367, 365లో ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నది. భవనాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది మున్సిపాలిటీ వారే”అని తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు.