నాగర్‌కర్నూల్ మాజీ సర్పంచ్ కన్నుమూత
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీసర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ శరత్ బాబు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధిపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన మాజీఎమ్మెల్యే వీఎన్ గౌడ్ రెండవ కుమారుడైన శరత్ బాబు మున్సిపాలిటీ ఏర్పడకముందు నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీకి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వంగా శరత్ బాబు కొన్నేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వీఎన్ గౌడ్ కుటుంబానికి మంచి రాజకీయ గుర్తింపు ఉంది. శరత్ బాబు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ ప్రాంతంలో బంధు, బలగం ఉన్న శరత్ బాబు కుటుంబం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆయన మృతిపట్ల పలువురు టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.