- రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్
- నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, మీడియా కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ, టెలివిజన్, ప్రచార సామాగ్రి ప్రజలకు తెలిసేలా ప్రదర్శించొద్దని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకూ జైలు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.