- బంగారంతో ఏకంగా టీషర్టు
- మిక్సర్ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్
- చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం
సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన దేశానికి తీసుకురావడానికి కొందరు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఒకరు పంటిలో, మరొకరు ఒంటిలో, మరొకరు షూస్‌లో అమర్చుకుని తెచ్చిన ఘటనలను చాలా చూశాం.. కానీ వాటికి మించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. బంగారాన్ని రవాణా చేయడానికి ఇన్ని మార్గాలు ఉంటాయా? అని తనిఖీలు చేస్తున్న కస్టమ్స్ అధికారులు నివ్వెరపోతున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని కరగబోసి తీసుకొచ్చిన తీరును చూసి విస్తుపోయి.. ఓరి మీ తెలివి అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏప్రిల్ 21న దుబాయ్ నుంచి(FZ-8779) విమానంలో హైదరాబాద్ రావడానికి ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేయగా, అతని లగేజీలోని టీ షర్ట్ లో బంగారం ఉన్నట్టు కనుగొన్నారు. టీషర్ట్ ను స్వాధీనం చేసుకుని విప్పిచూడగా అందులో రూ.19 లక్షల విలువ చేసే 386 గ్రాముల బంగారం ఉంది. గోల్డ్ ను కరిగించి పేస్ట్ గా మార్చి ఉంది. టీ షర్టు పొరల్లో సమాంతరంగా బంగారాన్ని పొందుపరిచాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారించారు.
తాజాగా ఏప్రిల్ 29న మరో వ్యక్తి బంగారాన్ని కరగబోసి మిక్సర్ గ్రైండర్ లో తీసుకొచ్చాడు. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ కు వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. సదరు వ్యక్తి రూ.2.797 కిలోల బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ లో అమర్చుకుని తరలిస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి విప్పి చూడగా అందులో సుమారు రూ.1.52 కోట్ల విలువ చేసే బంగారం పట్టుబడింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు కస్టమ్స్అధికారులకే కొత్త సవాల్ విసురుతున్నాయి. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి వారు వేస్తున్న ఎత్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే చిత్తవుతున్నాయి.