Breaking News

పెద్దరికం హోదా నాకొద్దు

పెద్దరికం హోదా నాకొద్దు
  • తగవులు తీర్చడం నా వల్ల కాదు
  • సినీ కార్మికులకు అండగా ఉంటా
  • మెగాస్టార్​ చిరంజీవి
  • సినీ కార్మికులకు లైఫ్​ టైమ్ ​హెల్త్​ కార్డులు పంపిణీ

సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్​చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ‌పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, యోద డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో సినీపరిశ్రమలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉంటానని, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకొస్తానని భరోసా ఇచ్చారు. అనవసరమైన వాటికి మాత్రం ముందుకొచ్చే ప్రసక్తే లేదని, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని తన వద్దకు వస్తే తాను ఆ పంచాయతీ చేయబోనని స్పష్టం చేశారు. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా వారికోసం నిలబడతానని చెప్పారు.

సినీకార్మికులకు ఫ్రీగా టెస్టులు

సినీకార్మికులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో లైఫ్​ టైం హెల్త్ ​కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మెగాస్టార్ ​చిరంజీవి పేర్కొన్నారు. సాంకేతికత ఆధారంగా హెల్త్ కార్డులను తయారు చేశామని, దీనిపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, స్కాన్ చేస్తే కార్డుదారుల వివరాలు, వారు తీసుకున్న ట్రీట్​ మెంట్​వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ కార్డుతో సినీకార్మికుల కుటుంబం మొత్తం ఎక్సరే దగ్గరి నుంచి ఎంఆర్ఐ వరకు అన్ని టెస్టులను ఉచితంగా చేయించుకునే వీలుంటుందని చెప్పారు. సినీ పరిశ్రమలోని 18 యూనియన్లకు చెందిన కార్మికులు వందశాతం ఈ డయాగ్నస్టిక్ హెల్త్ కార్డుల కోసం రిజిస్టర్ చేసుకున్నారని, మరో ఆరు యూనియన్లకు చెందిన కార్మికుల వివరాలను నమోదు చేయాల్సి ఉందన్నారు. కార్మికులు తమకు సంబంధించిన యూనియన్లలో వివరాలను అందజేస్తే వీలైనంత త్వరగా ఈ హెల్త్ కార్డులను అందించేందుకు వీలవుతుందని, ఇంటికి వచ్చి ఈ కార్డులను ఇవ్వరని దయచేసి యూనియన్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు.