– సీఎం కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల ఫైర్
సారథి, హైదరాబాద్: ‘చావునైనా బరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో తనను తెలుసన్నారు. సోమవారం శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాటి సీఎం వైఎస్సార్ బెదిరింపులు, ప్రలోభాలకు లొంగలేదన్నారు.
నయీం లాంటి వ్యక్తులు రెక్కీ నిర్వహించినా బెదిరిపోలేదన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్ కు అసైన్డ్ భూముల నుంచి రోడ్డు వేయలేదా? అని ఈటల ప్రశ్నించారు. మంత్రులకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, కనీసం మనుషులుగానైనా గుర్తించాలని హితవు పలికారు. పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. తన మీద ఏ కేసు పెట్టినా వెనక్కి తగ్గేదిలేదని పేర్కొన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు. కేసీఆర్ కు మచ్చతెచ్చే పని ఏనాడూ చేయలేదన్నారు. నీ అధికారులకు వావి వరుసలు కూడా తెలియడం లేదని మండిపడ్డారు.
జమున వైఫ్ ఆఫ్ నితిన్ రెడ్డి అని ఎలా రాస్తారని మండిపడ్డారు. మీకు కుడా కుటుంబసభ్యులున్నారని అన్నారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికలో హడావుడి తప్ప వాస్తవం లేదన్నారు. జమున హ్యాచరీస్ తో తనకు సంబంధం లేదన్నారు. తాను ఈ సంస్థలో చైర్మన్, డైరెక్టర్ గా కూడా లేనని స్పష్టంచేశారు. న్యాయం కోసం కోర్టు వెళ్లానని, తప్పుచేస్తే ఓ శిక్షకైనా రెడీ అని ఈటల ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈటల ప్రకటించారు.
కారు గుర్తుపై గెలిచినందుకు రాజీనామా చేయమని అడగొచ్చని, తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సివిల్ సప్లయీస్ శాఖలో కూడా అక్రమాలు జరిగాయని మున్ముందు తనపై ఆరోపణలు చేయొచ్చన్నారు. దేవరయాంజిల్ రెవెన్యూ పరిధిలోని భూముల విషయంలో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని నాడు సీఎం వైఎస్సార్ తో సవాల్ చేశారని గుర్తుచేశారు. నా కోసం స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.