Breaking News

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

  • అన్ని కులాలు, మతాలను ప్రేమించండి
  • ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి
  • సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి
  • మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కర్తవ్యబోధ చేశారు.
జాగ్రత్తగా మెలగాలి
‘కోట్లాది మందిలో కేవలం కొద్దిమందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి హితవు పలికారు.
అబద్ధాలు చెప్పొద్దు.. ఆప్యాయతతో పలకరించండి
‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ వద్దకు వచ్చే వాళ్ల కులం, మతం చూడొద్దు. ప్రతిఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పొద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
గరీబోళ్ల బాధ వినండి
‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’ అని సీఎం కేసీఆర్ ​చెప్పారు.

కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు

విశ్వనగర వైభవాన్ని పెంచాలి
‘హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలు ఉన్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది. గుజరాతీ గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలు ఉన్నారు. మలయాళీలు ఉన్నారు. మార్వాడీలు ఉన్నారు. ఖాయస్తులూ ఉన్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా మాదిరిగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉంది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్నివర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’ అని సీఎం కేసీఆర్​పిలుపునిచ్చారు.
కలిసికట్టుగా ముందుకుసాగండి
‘ఇంత మంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేం. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.