Breaking News

కరాటేలో కిర్రాక్​

కరాటేలో కిర్రాక్
  • అంతర్జాతీయ స్థాయికి ఆటోవాలా
  • గ్రామీణ యువకుడిలో విశేష ప్రతిభ
  • యువతకు శిక్షణ ఇచ్చి పలువురిలో స్ఫూర్తి

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఓ మారుమూల గ్రామీణ యువకుడు నిరూపించాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఓ వైపు ఆటోడ్రైవర్​గా తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన కరాటే రంగంలో పేరు తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని, నచ్చిన రంగంపై ఆసక్తి పెంచుకుని, అందులో కృషిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పరుశురాం నిరూపించాడు.

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన పుట్ల బాలయ్య, మణెమ్మ దంపతులకు పరుశురాం ఒక్కడే కొడుకు. ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి బాలయ్య మరణించాడు. దీంతో తల్లి మణెమ్మ వారికున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకును చదివించింది. పరుశురాం పెద్దశంకరంపేటలోని యువచైతన్య కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం వరకు చదివాడు. కుటుంబపోషణ, తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆర్థికంగా గట్టెక్కాలంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో డ్రైవింగ్ రంగం ఎంచుకున్నాడు. డ్రైవింగ్ నేర్చుకుని ఆటోడ్రైవర్​గా మారాడు. అప్పటినుంచి ప్రతిరోజు స్కూలు పిల్లలను ఆటోలో పెద్దశంకరంపేటకు తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్లేవాడు.

కుటుంబభారం మోస్తూ..

స్కూలు పిల్లలు, ప్రయాణికులతో వచ్చే డబ్బుతో కుటుంబభారం మోశాడు పరుశురాం. మరోవైపు పొలం సాగు కూడా విడిచిపెట్టలేదు. ఇదే క్రమంలో ఆటోను నడుపుతూ మెదక్ పట్టణానికి వెళ్తుండేవాడు. ఒకసారి అక్కడ నిర్వహిస్తున్న కరాటే పోటీలను చూసి అతనికి దానిపై ఆసక్తి పెరిగింది. ఎలాగైనా ఈ ఆత్మ రక్షణవిద్యలో అడుగుపెట్టాలని పట్టుదల పెరిగింది. ఈ క్రమంలో మెదక్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ నగేష్ వద్ద శిక్షణ పొందాడు. ఓ వైపు ఆటో నడుపుతూనే ఖాళీ సమయంలో శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. ఇలా ఆరేళ్లుగా ట్రైనింగ్ క్లాసులకు హాజరయ్యాడు. ఆరేళ్లలో అన్నిరకాల బెల్టులు సాధించి పలు టోర్నీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా బ్లాక్ గ్రేడ్​పరీక్షలో గెలిచి ప్రముఖ సినీనటుడు సుమన్ చేతులమీదుగా బెల్టు అందుకున్నాడు. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఏసియన్ ఓపెన్ చాంపియన్ షిప్ పోటీల్లో 13 దేశాలకు చెందినవారు పాల్గొన్న అండర్–20 స్పారింగ్ బ్లాక్ బెల్ట్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు. జాతీయ స్థాయి ప్రదర్శనల్లో పలు పతకాలు సాధించి తన సత్తాను చాటుకున్నాడు.

యువతకు ఉచిత శిక్షణ

ఆత్మరక్షణ, దేహదారుఢ్యానికి దోహదపడే కరాటే విద్యను పరుశురాం తన స్వగ్రామం జూకల్ వాసులకు ఉచితంగా నేర్పిస్తున్నాడు. ప్రతివారంలో రెండు రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటున్నాడు. పలువురు జూకల్ గ్రామానికి చెందినవారే కాకుండా, కరాటేపై ఆసక్తి ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ లకు హాజరవుతున్నారు. పరుశురాం వద్ద నేర్చుకున్న దాదాపు 14 మంది యువకులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా ఐదుగురికి బంగారు పతకాలు లభించాయి. ఇలా ఆయన తన స్వగ్రామమైన జూకల్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరును తీసుకొచ్చినందుకు గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటుచేసి పరుశురాంను ఘనంగా సత్కరించారు.