- గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి
హరిద్వార్: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ సూలూరు నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది మరణించారు. ఒకరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రావత్ మరణంతో దేశప్రజలు దుఖ:సాగరంలో మునిగిపోయారు.