Breaking News

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..
  • కాంగ్రెస్​, బీజేపీ మోసం చేశాయి
  • కమిటీలతో కాలయాపన చేశాయి..
  • నన్ను గెలిపిస్తే పార్లమెంట్​లో కొట్లాడతా..
  • నాగర్​కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్​, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్​ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. నవంబర్​ లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్​ లో ఓ మీటింగ్​ జరిగిన తర్వాత ఓ కమిటీ వేస్తున్నామని మోడీ చెప్పారని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్​ ఉషా మెహ్రా కమిటీ వేసిందని, నేడు బీజేపీ కూడా కమిటీ వేసి కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మాలలు, మాదిగలను ఆ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని అన్నారు. బీఆర్​ఎస్​ 2015లోనే అప్పటి సీఎం కేసీఆర్​ నాయకత్వంలో వర్గీకరణ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని గుర్తుచేశారు. మాన్యశ్రీ కాన్షీరాం ఏ వర్గాలు ఎంత ఉంటాయో ఆ వర్గాలకు సంపద, రాజ్యాధికారంలో అంతే వాటా ఉండాలని అన్నారని గుర్తుచేశారు. తనను గెలిపిస్తే పార్లమెంట్​ వేదికగా వర్గీకరణ కోసం కొట్లాడతానని స్పష్టంచేశారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని ముక్కుపిండి అయినా సరే అమలయ్యేలా చూస్తానని అన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.