- పనులు చేస్తుండగా కూలీలకు లభ్యం
- ఒకేచోట 100కు పైగా నాణేలు వెలుగులోకి..
- వాటి విలువ రూ.కోటిపైమాటే
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో శివాలయం పక్కన జనార్ధన్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లును కడుతుండగా, పునాదుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయి. అసలు విషయం ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలు తలా పంచుకున్నారు. అసలు విషయం బుధవారం వెలుగుచూసింది. పునాదులు తవ్వడానికి 10 మంది కూలీలు పనిచేశారు. అందులో 9 మంది వాటిని తీసుకొన ఒకరికి మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ కూలీ ఇంటి యజమానికి అసలు విషయం చెప్పాడు. ఆ నోటా ఈ నోటా బంగారు నాణేలు, బంగారు ఆభరణాలు లభించిన సంగతి బయటికి పొక్కింది. ఒక్కొక్కరు 10 నుంచి 15 దాకా నాణేలు, ఆభరణాలను కరిగించి పంచుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు కోటి రూపాయల మేర ఉండవచ్చని అంచనా. కూలీలు మాత్రం తమకు దొరికింది వాస్తవమేనని, స్థానిక బంగారు షాపులో కరిగించామని, మరికొంత మంది కర్నూలు పట్టణంలో కరిగించి అమ్ముకున్నామని చెప్పుకొచ్చారు. మీకు దొరికిన బంగారు ఆభరణాలు, నాణేలను ఇవ్వాలని, లేకపోతే పోలీసులకు ఫిర్యాదుచేస్తానని హుకుం జారీచేశాడు. అయినా వారు వినకపోవడంతో మానవపాడు ఎస్సై సంతోష్ కుమార్, తహసీల్దార్ వరలక్ష్మి నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పునాది తవ్వినచోట బంగారు నాణేలు లభించాయని కూలీలు అంగీకరించారు.
ఈ ఆభరణాలు ఎక్కడివి?
ఇంటి నిర్మాణం చేపడుతున్న యజమాని జనార్ధన్‌రెడ్డి పూర్వీకులకు అప్పట్లో పెద్దసంఖ్యలో ఆస్తులు ఉండేవి. సుమారు 180 ఎకరాల భూస్వాములు. వారే దాచిపెట్టారా..? లేదా పూర్వం ఎవరైనా దాచిపెట్టారా? అన్న అసలు విషయంలో సమగ్ర పరిశీలనలో తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా, గతంలో కూడా ఈ ప్రాంతంలో కలుగొట్లలో వెండి నాణేలు లభించాయి. ఇలా వరుసగా బంగారు, వెండి వస్తువులు లభించడం ఆసక్తి కలిగిస్తోంది. రాజవంశీకులు దాచారా..? లేదా నిజాం నవాబుల పరిపాలనలో పాతిపెట్టారా? ఏమిటన్నది పురావస్తుశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.