Breaking News

ఐదు జిల్లాల్లో పోరు

ఐదు జిల్లాల్లో పోరు
  • టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు
  • 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
  • మిగతా 6 స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • మెదక్​బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్​పోటాపోటీ

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి, నల్లగొండ ఒకటి, మెదక్‌ ఒకటి, ఖమ్మం ఒకటి, కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి దండె విఠల్‌, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్‌ నుంచి డాక్టర్‌ వంటేరు యాదవరెడ్డి, కరీంనగర్‌ నుంచి భానుప్రసాద్‌ రావు, ఎల్‌.రమణ ఎన్నికల బరిలో నిలిచారు.

మెదక్​లో హోరాహోరీ

ఇక మెదక్​స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు బరిలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్​తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటకు చెందిన బోయిని విజయలక్ష్మి శుక్రవారం తన నామినేషన్ ను విత్​డ్రా చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్​హరీశ్​కు అంగీకారపత్రం రాసిచ్చారు. మెదక్​నుంచి ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో రెండింటిని తిరస్కరించారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఒంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా టి.నిర్మలా జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.