Breaking News

రాజేంద్రుడే.. విజయేంద్రుడు

రాజేంద్రుడే.. విజయేంద్రుడు

  • 23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ
  • 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల
  • మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు
  • ఉద్యమనేతగా అప్రతిహత విజయం
  • ప్రజాభిమానం ముందు పారని తాయితాలు
  • అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు
  • ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం
  • బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు
  • సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్​

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, ఎన్నికల తాయితాలు, పదవుల పాచికలు పారలేదు. ఆత్మాభిమానాన్ని ఢీకొనలేక అహంకారం తోక ముడిచింది. ప్రజాస్వామ్యం ఎదుట ధనస్వామ్యం మోకరిల్లింది. అంతిమంగా ప్రజలే విజేతలుగా నిలిచారని తేటతెల్లమైంది. తిరిగి ఏడవ సారి ఈటల రాజేందర్​నే ఈ గడ్డ ప్రజలు ఎన్నుకున్నారు. సమీప టీఆర్ఎస్ ​అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​పై 23,855వేల ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్​ ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ కు 1,06,780, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​కు 83,167, కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూర్ వెంకట నర్సింగరావుకు 3,014 ఓట్లు పడ్డాయి. మొదటి నుంచీ టీఆర్ఎస్​ అభ్యర్థి వెనుకంజలోనే ఉన్నారు. 8,11వ రౌండ్​లో గెల్లు శ్రీనివాస్​యాదవ్ ​అనూహ్యంగా రేసులోకి వచ్చినా మళ్లీ వెనకబడిపోయారు. కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూర్ వెంకట నర్సింగరావు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన హుజూరా‘బాద్‌షా’ ఎవరో తేటతెల్లమైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో అత్యంత భద్రత మధ్య మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత ఉదయం 8 గంటలకు 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. ప్రతి కేంద్రంలో ఏడు టేబుళ్ల చొప్పున ఏకకాలంలో రెండుచోట్ల 14 టేబుళ్లపై కౌంటింగ్​కొనసాగింది. మొత్తంగా 22 రౌండ్ల వారీగా లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్​లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. 22వ రౌండ్​లో ఈటలకు 1,130 ఓట్ల మెజార్టీ వచ్చింది.

బీజేపీ నేతల సంబరాలు
హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయను భుజాల మీద ఎత్తుకుని కార్యకర్తలు సందడి చేశారు. పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు.

బండి సంజయ్‌కు అమిత్‌షా ఫోన్‌
హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ టీఆర్ఎస్​అభ్యర్థిపై ఆధిక్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఉపఎన్నిక ఫలితాలపై అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

విజయంపై ఎవరెవరు ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోందని బండి సంజయ్‌ అన్నారు. ఆయన గెలుపు బీజేపీ గెలుపే అన్నారు. దళితబంధు తీసుకొచ్చినా ప్రజలు టీఆర్ఎస్​ను నమ్మలేదని వ్యాఖ్యానించారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ టీఆర్ఎస్ ​ఆధిక్యం చూపలేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ ​పతనం ప్రారంభమైందన్నారు. ఆత్మగౌరవం, అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవం గెలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనపట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరాశ చెందొద్దు: రేవంత్‌ రెడ్డి
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నక ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు కార్యకర్తలను ఎంతో నిరాశకు గురిచేశాయి. అయినా, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్‌ను నిర్ధారించలేవు, నిర్ణయించలేదు. ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితిల్లో జరిగింది’ అని అన్నారు.